శ్రీ క్రోధి నామ పంచాంగం :మేషరాశిలో ఈ ఏడాదంతా వాళ్లకు  కలిసొచ్చే ఛాన్స్

ఆదాయం   : 8
వ్యయం      : 14
రాజపూజ్యం : 4
అవమానం  : 3

అశ్వని 1,2,3,4 పాదములు; భరణి 1,2,3,4 పాదములు, కృత్తిక 1 పాదము. మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లూ, ఏ, ల, లో, ఆ

గురువు ది. 9.4.2024 నుండి 1.5.2024 వరకు మేషరాశిలో తదుపరి 9.3.2025 ఉగాది వరకు తామ్రమూర్తి సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 వరకు లోహమూర్తి కుంభరాశిలో సంచారం. రాహుకేతువులు 9.4.20204 ఉగాది నుండి మరల ఉగాది వరకు సువర్ణమూర్తిగా సంచారం.

ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. రైతులు ముహూర్తబలంతో వ్యవసాయం చేసినా నష్టములు రావు. వృత్తి వ్యాపారులకు అనుకూలం. గృహనిర్మాణం, పిల్లల వివాహం చేయుటకు ప్రయత్నములు చేయండి. కాంట్రాక్టర్లకు అనుకూలం. కిరాణ, ఫ్యాన్సీ వ్యాపారులకు సామాన్యం. వెండి, బంగారు, కాపర్​ వ్యాపారులకు అనుకూలం. బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. స్మాల్ ఇండస్ట్రీ వారికి వ్యాపార ధోరణి అర్థం కాదు.

చిట్స్ సామాన్యం. విద్యార్థులకు అనుకూలం. నిరుద్యోగులకు సామాన్యం. రాజకీయ నాయకులకు కలిసొచ్చే కాలం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనాదాయం. కాని డబ్బు కనిపించదు. కంప్యూటర్ రంగం వారికి రాబోవు రోజులలో గడ్డుకాలం. తొందరపాటుతనంతో కోర్టుకేసులు. నమ్మినవారి వలన కష్టనష్టాలు. అనారోగ్య సూచనలు. నవగ్రహ ప్రదక్షిణలు, జపాలు, దానాలు, గ్రహాల కలయిక వలన అనేక విధములుగా ఉన్న చిక్కు సమస్యలు తొలగును.

గృహశాంతి కొరకు అఖండ దీపారాధన. ప్రతినిత్యం దీపం వెలుగుచున్న గ్రహ శాంతి ఉంటుంది. అశ్వని నక్షత్రం వారు జాతి వైడూర్యం ధరించండి. వినాయక సరస్వతిదేవికి పూజలు చేయండి. చిత్రగుప్తుని దేవాలయ దర్శనం వలన అనుకూలం. భరణి నక్షత్రం వారు జాతి వజ్రం ధరించగలరు. లక్ష్మీదేవి పూజలు, కనకధార స్తోత్రం పారాయణ చేయండి. కుసుమ నూనెతో దీపారాధన చేయుట వలన ఒత్తిడి అదుపులోకి వస్తుంది. శ్రీచక్రమునకు కుంకుమతో ఆరాధన చేయండి. కృత్తిక నక్షత్రము వారు జాతి కెంపు ధరించండి. ఆదిత్య హృదయ పారాయణ చేయండి. ఆదివారం నియమములు పాటించండి. సూర్య నమస్కారాలు, యోగ, ధ్యానం చేయండి. మృత్యుంజయ జపముల వల్ల తగాదాలు రావు. అదృష్ట సంఖ్య 9.


చైత్రం: స్త్రీ పురుషులకు సామాన్యం. ప్రతి విషయంలో తెలియని భయం. భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం. ఆదాయానికి మించిన ఖర్చులు. ఔషధ సేవలు, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. 

వైశాఖం: స్త్రీ పురుషులు పంతాలు పట్టింపులకు వెళ్ళరాదు. ఓర్పుగా ఉండాలి. ఆర్థిక లోటుపాట్లు. కనకధార స్తోత్రం, ఓం నమోనారాయణాయ జపం చేయండి.

జ్యేష్టం: స్త్రీ పురుషులకు చాలా అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్, ఆకస్మిక ధనలాభం. తీర్థయాత్రలు చేయగలరు. గృహ అవసరమైనవి సమకూర్చుకొనుట. విద్యార్థులకు సంతృప్తి. అఖండ దీపారాధన, లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర పూజలు చేయండి.

ఆషాఢం: అనుకూలమైన రోజులు. వాహన సౌఖ్యం. ఆకస్మిక ధనాదాయం. పెండింగ్​లో ఉన్న పనులు నెరవేరును. నూతన పరిచయాల వల్ల సంతృప్తి. జాయింట్ వ్యాపారాలు కలిసిరావు. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

శ్రావణం: చాలా అనుకూలం. ఓర్పునేర్పుతో లౌకిక భావన కలిగి ప్రతివిషయంలో చాకచక్యంగా మసలుకొనగలరు. గృహ అవసరమైనవి సమకూర్చు కొనగలరు. సత్య నారాయణ స్వామి వ్రతం చేయండి.

భాద్రపదం: వ్యవహారాలందు చాకచక్యంగా మసలుకొంటే ఆకస్మిక ధనలాభం. ఇతరుల విషయంలో తలదూర్చరాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజల వలన శత్రుబలం తగ్గును. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండగలరు. వినాయక పూజలు చేయండి.

ఆశ్వయుజం: స్త్రీ పురుషులకు తెలియని సమస్యలతో సతమతమవ్వగలరు. ఏ విషయమైనా ఇబ్బందికరమే. ఇంకొక ప్రక్క భయపడవలసిన పరిస్థితులు కనిపించును. స్త్రీ మూలంగా సమస్యలు. నమ్మినవారు మోసం చేయుట. దుర్గాదేవికి పూజలు, నిత్య దీపారాధన చేయండి.

కార్తీకం: స్త్రీ పురుషులకు కుటుంబంలో ప్రేమను పెంచుకొని ఇంట గెలిచి రచ్చ గెలవటం. సమస్యలు వచ్చినా మీ ఓర్పు మిమ్ములను కాపాడుతుంది. నూతన పరిచయాలు అనుకూలం. మహన్యాస రుద్రాభిషేకం చేయండి.

మార్గశిరం: స్త్రీ పురుషులకు చేయు వృత్తివ్యాపారములందు అధిక ఫలితములు.  శత్రువులపైన విజయం సాధించగలరు. సంతానలాభం. విందు, వినోదములు, వాహన సౌఖ్యము. మొహమాట పడరాదు. నవగ్రహ పూజలు, జపాలు చేయండి.

పుష్యం: స్త్రీ పురుషులకు అధికారుల మన్ననలు. గృహోపకర వస్తువులు సమకూర్చుకొనగలరు. ప్రయాణములో అనుకూలం. స్త్రీలను జాగ్రత్తగా గమనించి దూరముగా ఉండండి. వినాయక సరస్వతి శివనామ స్మరణ చేయండి.

మాఘం: స్త్రీ పురుషులకు సాధారణ పరిస్థితులు ఉన్నవి. శుభకార్యములు నెరవేరును. ఇష్టకార్యసిద్ధి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొనగలరు. వేంకటేశ్వర స్వామి అలంకరణ దర్శనం చేయండి. చక్కెర పొంగలి ప్రసాదములు.

ఫాల్గుణం: తొందరపాటు నిర్ణయములతో ధనవ్యయము చేయగలరు. ప్రయాణ ప్రమాదములు కలిగి ఉన్నారు. మాతృపితృ పీడలు కలిగి ఉన్నారు. దైవముపైన భారం వేసి ముందుకు నడుచుట మంచిది. శివారాధన చేయగలరు.

Also Read :శ్రీ క్రోధి నామ పంచాంగం: వృషభ రాశి వారికి ఈ ఏడాది కత్తిమీద సామే...